Sunday, February 12, 2012

శీర్షాసనం

నమ్మాల్సిన అక్షరాల్ని అమ్మేస్తున్నాడు
నమ్మి వచ్చిన ’నారి’ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నాడు
పెంచాల్సిన పసికందును పెంటపై పారేస్తున్నాడు
ఆదరించాల్సిన "అమ్మ"ను అవతలకు నెట్టేస్తునాడు
అణచాల్సినా "అణుశక్తి"ని ఆకాశానికెత్తేస్తునాడు
అభిమానించాల్సినా దేశాన్ని అతి దారుణంగా అవమానిస్తున్నాడు


భారతమాత మళ్ళీ బంధింపబడింది
మరో గాంధీ... ఎవరో వచ్చి విముక్తి చేయాల్సి ఉంది


"చెడు" చండశాసనుడై చకచకా రాజ్యమేలుతోంది
"మంచి" సాధుడై మాంద్యగతిని మట్టి కఱచుకుపొతోంది
రాబందులకు తెల్లరంగు పూసేసి
అవే శాంతి కపోతాలని ఎగురవేస్తున్నారు
శాంతిపావురాలు చెండాలుడనే వేటగాడి గురి దెబ్బలకు
క్రిందపడి, బురదలో కూరుకుపోతున్నాయి


"నీతి" నియమనిష్టలంటూ మడి కట్టుకూర్చుంది
కప్పలా - బావిలో కప్పలా
"బూతు" బరితెగించి స్వైరవిహారం చేస్తుంది
పక్షిలా - రెక్కలొచ్చిన పక్షిలా
"న్యాయం" నలుగుతోంది నల్లధనం క్రింద
నల్లిలా - నులకమంచంలో నల్లిలా
"అన్యాయం" అందలమెక్కుతోంది అందంగా
రాణిలా - అపరంజి బొమ్మలా
భారతమాత మళ్ళీ బంధింపబడింది
మరో గాంధీ - ఎవరో వచ్చి విముక్తి చేయాల్సి ఉంది


నడాల్సింది ధర్మం నాలుగు పాదాల
నడుస్తూందిప్పుడు అధర్శం ఆరున్నర పాదాల
నడాల్సి ఉంది నరుడు రెండు పాదాల
నడుస్తున్నాడిప్పుడు గురుడు తలక్రిందులుగా


ఎంతసేపు ఈ శీర్షాసనం?



No comments:

Post a Comment