Sunday, February 12, 2012

సునామిక

కడలిపోటుకు
గుండెపాళి విరిగి
నా అక్షరం ముక్కలై
కన్నీరు కార్చింది


’అల’జడికి
కల చెదిరి
వల ముక్కలై
పడవ చెక్కలయింది
బెస్తల బతుకు భారమయింది


పాదచారులకు
ఉదయపునడకలు
మృత్యుపడకలయ్యాయి


భక్తయాత్రికుల
జీవితయాత్రలే ముగిసాయి


మనిషి చేసే ఆగడాలకు
ఆగలేకేమో ప్రకృతే వికృతించింది


భూమి పొరల సంఘర్షణలో
హోరెత్తిన కడలి
కాటుకు కడతేరిన బతుకులు
శివమెత్తిన గంగ, ఉప్పెనై
వూర్లనే వల్లకాడుగా మార్చింది


జలప్రళయ రుద్రతాండవంలో
నుజ్జునుజ్జు అయిన బ్రతుకులెన్నో...
విధివంచితులై యింకా జీవం ఉండీ
జీవఛ్ఛవంలా బ్రతుకునీడుస్తున్న
బండబారిన నైరాశ్యపు బ్రతుకులెన్నో...


ఆకస్మిక అనామిక బ్రతుకుల్లో
ఆశను చిగురింపచేద్దాం
’సహాయం’ అన్న నీరును పోసి
సునామికా జీవితాలను పుష్పింపచేద్దాం.

No comments:

Post a Comment